నవీన పదనిష్పాదనకై - TopicsExpress



          

నవీన పదనిష్పాదనకై కొన్ని మార్గదర్శకాలు విస్తరిస్తున్న ఆధునిక విజ్ఞానానికీ వ్యవహారానికీ, అవసరాలకీ అనుగుణంగా కొత్త తెలుగుపదాల్ని కల్పించుకునేటప్పుడు కొన్ని ఆదర్శసూత్రాల్ని గమనంలో ఉంచుకోవడం అభిలషణీయం. 1. కొత్త వాడుకలు అలతి అలతి పదాలతో ఏర్పఱచిన చిఱుసమాసాలై ఉంటే మంచిది. పర్యాప్తమైన చిఱుతనాన్ని (optimum smallness) నిర్వచించడం కష్టం. కాని స్థూలంగా :— (అ) తెలుగులిపిలో అయిదు అక్షరాలకి మించని పదాలూ, (ఇ) ఒకవేళ అయిదు అక్షరాలకి మించినా, ఆఱేడు అక్షరాలు కలిగి ఉన్నా, రెంటి కంటే ఎక్కువ అవయవాలు లేని సమాసాలూ చిఱువాడుకలు అని భావించవచ్చు. 2. సాఫీగా అర్థమయ్యే ఇంగ్లీషు పదాల (plain English terms) కి విశేషణాల (adjectives) తో కూడిన వర్ణనాత్మక పదజాలాన్ని సృష్టించడానికి పూనుకోకూడదు. అలాంటి ప్రయత్నం సాధారణంగా కొండవీటి చాంతాడంత సమాసాలకి దారితీస్తుంది. ఉదాహరణకు ధూమశకటం. 3. ఒకవేళ మూల ఆంగ్లపదమే స్వయంగా ఒక సమాసమైనప్పుడు, దాన్ని రచయితలు ఒక ప్రత్యాహార (abbreviation) రూపంలో సూచిస్తున్నప్పుడు తెలుగులో కూడా దాన్ని ఒక సమాసంగా అనువదించి ఆపైన దానికి ఒక తెలుగు ప్రత్యాహార రూపాన్ని ఇవ్వడం తప్పు కాదు. ఉదా :- Portable Document Format (PDF) = వహణీయ పత్ర సంప్రకారం (వ.ప.సం.) 4. ఆదాన అనువాదాలు (Loan translations – అంటే మూలభాషలోని అర్థాన్ని మనం భాషలోకి అనువదించి పదాలు కల్పించడం) కొన్ని సార్లు తప్పవు. కాని అన్ని వేళలా అదే మంత్రం గిట్టుబాటు కాదు. బ్లాగ్ లాంటి పదాల్ని “దాదాపుగా” అలాగే ఉంచి తత్సమాల్లా వాడుకోవడం మంచిది. 5. తెలుక్కి స్వాభావికమైన జాతీయాన్ని నుడికారాన్ని (idiom) భ్రష్టుపట్టించకూడదు. తెలుగులో ఇమడని నిర్మాణాలు (structures) శీఘ్రంగా పరమపదిస్తాయని మఱువరాదు. 6. భాషాపరిశుద్ధతని నిలబెట్టడమే మన అంతిమలక్ష్యం కాదు. భాషని సుసంపన్నం చెయ్యడమూ, ప్రయోగాత్మకతని ప్రోత్సహించడం కూడా మన లక్ష్యాలే. కాబట్టి వైరి సమాసాల్నీ, మిశ్రసమాసాల్ని విఱివిగా అనుమతించాలి. అయితే అవి శ్రవణసుభగంగా (వినసొంపుగా) ఉంటేనే పదికాలాల పాటు నిలుస్తాయి. వికారమైన పదసంయోజనలది అల్పాయుర్దాయం. తప్పనిసరై దిగుమతి చేసుకున్న ఇంగ్లీషు పదాలకి సంస్కృత ప్రత్యయాల (suffixes) నీ, ఉపసర్గల (prefixes) నీ చేర్చి వాడుకోవడం ఆమోదయోగ్యమే. ఉదా : కర్బనీకరణ మొదలైనవి. 7. ఇంగ్లీషులో లాగే తెలుగులో కూడా ప్రత్యాహారాల (abbreviations) ద్వారా ఏర్పడే acronyms ని (వెకిలిగా పరిగణించకుండా) వాటికి ఒక గౌరవనీయ స్థానాన్ని కల్పించడం చాలా అవసరం. తెలుగులో ఇప్పటికే అలాంటివి కొన్ని ఉన్నాయి. ఉదా :- అ.ర.సం (అభ్యుదయ రచయితల సంఘం), వి.ర.సం (విప్లవ రచయితల సంఘం), సి.కా.స (సింగరేణి కార్మిక సమాఖ్య) వీటి సంఖ్య ఇంకా ఇంకా పెఱగాలి. ముఖ్యంగా తెలుగు శాస్త్ర సాంకేతిక రంగాల్లో! 8. మిశ్రపద నిష్పాదన (Hybrid coinage) ని ప్రోత్సహించాలి. అంటే, ఒక భాషకి చెందిన ఉపసర్గల్నీ ప్రత్యయాల్నీ ఇంకో భాషకి చెందిన దేశిపదాలకి చేర్చి కొత్త పదాలు పుట్టించడం. ఉదాహరణకి :- దురలవాటు. ఇందులో “దుర్” అనే ఉపసర్గ సంస్కృతం. “అలవాటు” తేట తెలుగు పదం. ఇలాంటివే నిస్సిగ్గు, ప్రతివాడు, అతి తిండి మొదలైనవి. ఇలాంటివి చాలా ఉన్నాయి కాని సరిపోవు. ఇవి వందలూ, వేలుగా పెఱగాలి. 9. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఒకటుంది. పాతపదాలు, కావ్యభాష, గ్రాంథికం అంటూ కుహనా అభ్యు దయవాదశైలిలో అస్పృశ్యతానామాంకాలు (Labels) వేసి మన ముందటితరంవారు తెలుగుపదాల అనర్ఘవిలువను గుర్తెఱగక నిర్దాక్షిణ్యంగా సంఘబహిష్కరణ చేసిన అచ్చతెలుగు పదజాలం అపారంగా ఉంది. అలాగే అలాంటి సంస్కృత పదజాలం కూడా విపరీతంగా ఉంది. . అభ్యుదయపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని పదాలన్నీ కావాలిప్పుడు దాస్తే దాగని భాష ! (మహాకవి శ్రీశ్రీకి క్షమాపణలతో) ఆ పదజాలాన్నంతా ఇప్పుడు వెలికి తీయక తప్పదు. ఈ సందర్భంగా వ్యావహారికవాదం పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన కొన్ని దురభిప్రాయాల్ని కూడా సవరించాలి. 10. సంపూర్ణ సమానార్థకాలు అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు సమీపార్థకాలతో సరిపెట్టుకుందాం. భాష నిరంతర పరిణామశీలి కనుక మనం ఎంపిక చేసినవాటి కన్నా మంచి పదాలు భవిష్యత్తులో ప్రతిపాదనకొస్తాయని ఆశిద్దాం. ఒకే పరిభావనకి ఇద్దఱు-ముగ్గుఱు వేఱువేఱు నిష్పాదకులు రెండుమూడు వేఱువేఱు పదాల్ని కల్పించగా, ఆ అన్ని నిష్పాదనలూ సర్వోత్తమంగా ఉన్నట్లు అనిపిస్తే వాటన్నింటినీ పర్యాయపదాలుగా భావించి స్వీకరిద్దాం. 11. పాతపదాలకి కొత్త అర్థాలు కల్పించడం ద్వారా కొత్త పదాల్ని శూన్యంలోంచి కల్పించే అగత్యం నుంచి బయటపడతాం. కొన్నిసార్లు ఉన్న పదాల్ని “తగువిధంగా” రూపాంతరించడం (modifying) ద్వారా కొత్తపదాల్ని కల్పించి భాషని సంపన్నించవచ్చు. మన తెలుగుభాషలో ఇందుకు చాలా ఉదాహరణలున్నాయి. ఉదా :- పథం = దారి పథకం = scheme పన్నకం = ఉచ్చుల అమరిక పన్నాగం = కుట్ర మొలక = మొలిచిన గింజ మొల్క à మొక్క = చిన్న చెట్టు సలుపు = ఇబ్బందిపెట్టు జలుబు = శీతబాధ జీవితం = బ్రతుకు జీతం = బ్రతకడానికి సరిపోయే పైకపు చెల్లింపు కట్టు = చుట్టికట్టేది గట్టు = సరిహద్దుగా కట్టేది వంక = ఏఱు వాక = అదే (ఏఱు) పోడు – కొంతకాలం వ్యవసాయం చేసి ఆ భూమిని తగలబెట్టడం బోడు/బోడి – మొక్కలూ గడ్డీ అన్నీ పెఱికి పారేసిన నేల దిగుబడి = పొలం నుంచి ఇంటికి తెచ్చుకుని దించుకునే పంట దిగుమతి = ఒడ/పడవ మీదినుంచి దించుకున్న సరుకు కంప = పొడవైన తీగెలూ ముళ్ళూ గల గుబురు (మూలం = కమ్ము–> కమ్మీ) గంప = పొడవైన వెదురుకమ్ముల్ని వంచి చేసిన పాత్ర (ఇనుము – ఇనప, ఱొమ్ము – ఱొంప అయినట్లు) చేకూరు = పోగగు చేకూరించుకొను = పోగు చేసుకొను –> చేకుఱించుకొను –> సేకరించుకొను (దీన్ని సేకరణ అని సంస్కృతీకరించడం కేవలం అసందర్భం. ఇలాంటి పదమేదీ సంస్కృతంలో లేదు) పెంట = మానవ శరీర పరిత్యక్తం పెండ (తెలంగాణాలో వాడుకలో ఉంది) = జంతుశరీర పరిత్యక్తం పచ్చిది = ఉడికించనిది పచ్చడి = ఉడికించకుండా నూఱి ఉప్పూ, కారమూ, పోపూ వేసిన కూరముక్కలు కొన్నిపదాల్ని ఇలా రూపాంతరించే ప్రక్రియలో భాగంగా వాటికి చివఱ ‘క’ చేర్చవచ్చు. (సంస్కృత పదాల విషయం లో కూడా ఆ భాష వ్యాకరణం ఇందుకు అనుమతిస్తోంది) : ఉదా :- ఒకర్తి – ఒకర్తుక పడతి – పడతుక పెంట – పెంటిక ఎమ్ము – ఎముక మొ|| 12. ఒక పదానికి ఎన్ని అర్థాలైనా ఉంటాయి గనుక ఆ అన్ని అర్థాలకీ ఇంకో భాషలోని దాని సమార్థకం కూడా ప్రాతినిధ్యం వహించాలంటే కుదరదు. సమార్థకాలన్ని సందర్భానుసారమైనవే గాని విదేశీ పదాలకి పూర్తిగా సోదర సమానాలు కావు. ఒక పదాన్ని ఇంగ్లీషులో ఎన్ని సందర్భాల్లో ఎన్ని అర్థాల్లో వాడతారో మన తెలుగుపదం కూడా అన్ని అర్థాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆ సందర్భానికి తగిన అనువాదం చెయ్యగలిగితే చాలు. అసలు అలా ఏ భాషలోను ఉండదు. మనం ‘ధర్మం’ అనే పదాన్ని అనేక అర్థాల్లో వాడతాం. సందర్భాన్ని బట్టి ఇంగ్లీషులో దానికి ‘law, natural justice, natural law, morality, duty’ అని రకరకాలుగా అనువదిస్తారు. వీటిలో ఏ ఒక్క పదాన్నీ ధర్మానికి ప్రతినిధిగా ఎల్లవేళలా వాడడానికి అవకాశం లేదు. 13. లింగ నిరపేక్షాలు (Gender-neutral words) దొఱికితే మంచిదే. దొఱక్కపోతే ఏం చెయ్యగలం? అన్ని భాషలూ ఇంగ్లీషులా ఉండాల్సిన పని లేదు. అయినా ఇంగ్లీషులో కూడా వస్తుతః లింగనిరపేక్షాలు లేవు. ప్రాచీన భాషల్లో అన్ని పదాలూ లింగసాపేక్షాలే (Gender-intensive words). (ఆ మాటకొస్తే ఏ భాషలోనూ లేవు). వారు ఒకప్పటి పుల్లింగాల్నే రెండు లింగాలకీ అనువర్తించడం మొదలుపెట్టి “అవే లింగనిరపేక్షాలు, పొ”మ్మన్నారు. కనుక తప్పనిసరి సందర్భాల్లో లింగ సహి తంగానే నిష్పాదించాల్సి ఉంటుంది. 14. ఇప్పటికే ఒక అర్థంలో వాడుకలో స్థిరపడ్డ పదాల్ని ముట్టుకోకూడదు. అర్థమౌతుంది కదా అని ఒక పదాన్ని అనేక అర్థాల్లో వాడడం మొదలుపెడితే అది చివఱికి అర్థం కాకుండానే పోతుంది. ఎందుకంటే కొత్త పరిభావనల (concepts) కి ఎప్పుడూ కొత్త పదాలే కావాలి. వాటిని ప్రజలకు నెమ్మదిగా అలవాటు చేయాలి. అంతేతప్ప వ్యావహారికవాద కండూతితో దొఱికిన/ తోచిన పాతపదాలతోనే తాత్కాలికంగా సరిపుచ్చుకుందామని ప్రయత్నించరాదు. అలా చేస్తే భాష ఎదగదు సరికదా, వాడుకపదాలన్నీ అవాంఛితమైన నానార్థాల్ని సంతరించేసుకుంటాయి. వ్యవహారహాని ఘటిల్లుతుంది. ఆఖరికి భాష మొత్తం ఒక పేద్ద విప్పజాలని పొడుపుకథగా, అర్థం చెప్పలేని అభంగశ్లేషగా, పరిష్కరణ దుస్సాధమైన చిక్కుముడిగా మారుతుంది. ఉదాహరణకు – ఒక దినపత్రికలో booking అనే మాటకు ఖరారు చేసుకోవడం అని వ్రాశారు. book చెయ్యడం, ఖరారు చెయ్యడం (finalization/confirmation) రెండూ ఒకటి కావు. కొంతమంది యాభైవేలు బయానా ఇచ్చి ఒక స్థలాన్ని book చేసుకుంటారు. కానీ వాళ్ళు మొత్తం ధరలో సగమైనా చెల్లిస్తేనే తప్ప ఆ స్థలం వారికి ఖరారు కాదు. booking కి పుస్తకించడం అని అనువదిస్తే బానే ఉంటుంది, అంతకుముందు ఆ పదం మన భాషలో ఏ ఇతర అర్థంలోనూ లేదు గనుక, దాన్ని ఒక కొత్త రూపంతో, ఒక కొత్త అర్థంలో వాడితే ఫర్వాలేదు. 15. పాతపదాల్ని కొత్త సాంకేతికతలకి అన్వయించి వాడుకోవడం అవసరం. ఇందునిమిత్తం కొన్నిసార్లు నిఘంటువుల దుమ్ముదులిపి పాతపదాల్ని కొత్త అర్థాలలో పునరుద్ధరించడానికి వెనుదీయకూడదు. ఉదాహరణకు, Fan అంటే ఒకప్పుడు విసనకఱ్ఱ. ఇప్పుడది ఒక విద్యుద్ యంత్రంగానే గుర్తించబడుతున్నది. కొత్త సంస్కృతపదాల్ని సృష్టించడం కంటే ఉన్న తెలుగు పదాలకి నూతన అర్థావగతిని కల్పించడం, ఆధునికీకరించడం అవసరం. మనం ఈరోజు దాకా చేస్తూ వచ్చినది – అలా ఇబ్బడిముబ్బడిగా సంస్కృత పదాల్ని సృష్టించడం, అవి ఎవఱైనా సరిగా పలక్కపోతే పలకలేదని బాధపడ్డం, వాటిని ఇంగ్లీషు పదాల క్లుప్తతతో పోల్చి పరిహసిస్తే ఉడుక్కోవడం. తెలుక్కి నూతనపద నిష్పాదనశక్తి లేదనడం సరైన అవగాహన కాదు. పదనిష్పాదన అనగానే మనం అసంకల్పితంగా సంస్కృతం వైపే పరిగెత్తడానికి అలవాటుపడిపోయాం. ఆ క్రమంలో మన దృష్టంతా – “సంస్కృత సమాసాల/ పదాల పరిశుద్ధతని ఎలా కాపాడాలి ? తెలుగుని ఎలా దూరంగా పెట్టాలి ? హిందీని చూచివ్రాయడానికి అవకాశం ఏమైనా ఉందా ?” ఇలాంటివాటి మీద కేంద్రీకృతమవుతున్నది. 16. ఏదైనా ఒక కొత్త పదాన్ని నిష్పాదించేటప్పుడు దాని క్రియారూపం (verb form), నామవాచక రూపం (noun form), విశేషణ రూపం (adjectival form). కర్తృరూపం (agency). కర్మరూపం (past participle form), ఉప కరణరూపం, కరణీయరూపం, శతృ-శానజ్ రూపం మొదలైన అనేక సంబంధిత రూపాల్ని దృష్టిలో ఉంచుకొని మఱీ నిష్పాదించవలసి ఉంటుంది. ఒకే పదానికి సంబంధించిన ఈ వివిధ నిర్మాణాలను పదకుటుంబం అని వ్యవహరించవచ్చు. విద్యావంతుడైన ప్రతితెలుగువాడూ ఈ పదకుటుంబాన్ని స్వయంగా కల్పించేంత ప్రతిభావంతుడు కావాలి. అప్పుడే మనం ఇంగ్లీషుతో పోటీపడగలం. ఉదా :-. క్రియారూపం — బోధించు నామవాచకరూపం — బోధన విశేషణరూపం — బౌధనికం, బౌధన్యం (బోధనకు సంబంధించిన) కర్తృరూపం — బోధకుడు, బోధకి (బోధించేవారు) కర్తృవిశేషణరూపం — బోధకీయం/ బోధకీనం/ బోధకేరం/ బౌధకికం = బోధకుడికి సంబంధించినది కర్తృసమూహం — బౌధక్యం = బోధకుల సమూహం కర్మరూపం — బోధితం (బోధించబడిన సబ్జెక్టు) ఉపకరణరూపం — బోధకం, బోధిత్రం, బోధని (బోధించే సాధనం) కరణీయ రూపం — బోధనీయం, బోధితవ్యం, బోధ్యం, బోధనాస్పదం, బోధనార్హం, బోధనయోగ్యం (బోధించ దగినది) శతృశానజ్ రూపం — బోధయత్, బోధయంతుడు (అలాగే జీవత్, జీవంతుడు మొ|| ) 17. తెలిసిన పదాల నుంచి కొత్త పదాల్ని నిష్పాదించడం సాధ్యం కానప్పుడూ, అలా నిష్పాదించినవి బాలేనప్పుడూ మన భాషాధ్వనికి అనుగుణంగా వినూత్న నామధాతువుల (brand new nominal roots) ని శూన్యంలోంచి సృష్టించాలి. అంటే అలాంటి పదాల విషయంలో మనం మానసికంగా ఆదిమకాలానికి మళ్ళాల్సి వస్తుంది. నూతన పదాల నిష్పాదనకి మాండలికాల వితరణ 18. ఆంగ్లపదాలకి తెలుగు సమానార్థకాల్ని రూపొందించే క్రమంలో మనం సంస్కృతం మీద హెచ్చుగా ఆధారపడుతూ వస్తున్నాం. దీనికొక కారణం మన సాంస్కృతిక వారసత్వం కాగా, ఇంకో కారణం – మన- అంటే విద్యావంతుల బౌద్ధిక వాతావరణం దేశి (గ్రామీణ) ప్రజానీకంతో సంబంధాలు కోల్పోయి ఉండడం. మనం ఉండేది నగరాల్లో/ అథవా పట్టణాల్లో! మనం చదివేది/మాట్లాడేది ఇంగ్లీషు లేదా ప్రామాణిక (శిష్టవ్యావహారిక) తెలుగు మాండలికం లేకపోతే ఇటు ఆంధ్రమూ, అటు ఆంగ్లమూ కానటూవంటి ఒక సంకర తెంగ్లీషు. తద్ద్వారా మనం చాలా కృతక (synthetic) వ్యక్తులుగా మారి పోయాం. పల్లెపట్లలో చాలా ముచ్చటైన దేశిపదాలు వాడుకలో ఉన్నాయి. వాటిల్లో చాలావఱకు ఇంగ్లీషు పదాలకి సమాధానం చెప్పగలవే. అయితే మనకి అవి తెలియకపోవడం. గ్రామీణులకేమో – అవి మనకి, అంటే పదనిష్పాదకులకి అవసరమని తెలియక పోవడం, ఈ కారణాల వల్ల పరస్పర సమాచారలోపం (communication gap) తీవరించి మనం క్రమంగా అసలైన తెలుక్కి దూరంగా, సుదూరంగా జఱిగిపోతున్నాం. “ఇంగ్లీషు పదాలే original, తెలుగు పదాలంటే మక్కికి మక్కి అనువాదాలు (True Translation), తెలుగంటే సంస్కృతం” అనే అభిప్రాయంలో పడి ఊగిసలాడుతున్నాం. కొన్నిసార్లు కొత్త పదాల్ని నిష్పాదించినవారే వాటిని వాడని పరిస్థితి కూడా లేకపోలేదు. మాండలికాలు లేకుండా తెలుగు పరిపూర్ణం కాదు. ఆ పదాల్ని ఆయా జిల్లాలకీ, తాలూకాలకీ పరిమితం చెయ్యకుండా శిష్ట వ్యావహారికంలోకి, సాహిత్య ప్రధానస్రవంతిలోకి తీసుకురాగలిగితే, అందరికీ వాటి వాడుకని అలవాటు చెయ్యగలిగితే భాషకి మహోపకారం జరుగుతుంది. అనువాదాలు చేసేటప్పుడు గానీ, సమానార్థకాల్ని రూపొందించేటప్పుడు గానీ మన భావదారిద్ర్యమూ, పదదారిద్ర్యమూ వదిలిపోతాయి. అంతకంటే ముఖ్యంగా సమార్థకాలకి కృత్రిమత్వదోషం నివారించబడి సహజ తెలుగుతనపు పరిమళాలు గుబాళిస్తాయి. మూర్త నామవాచకాల్ని (Material Nouns) ని అమూర్త నామవాచకాలు (Abstract Nouns) గా పరివర్తించడం ద్వారా చాలా బౌద్ధిక పదజాలాన్ని (intellectual vocabulary) నిష్పాదించవచ్చు. ఇందునిమిత్తం మనకి వ్యవసాయంతో సహా వివిధ గ్రామీణ వృత్తుల పదజాలాలు సహకరిస్తాయి. వాటిల్లో కొన్ని ఇప్పటికే సాహిత్యభాషలోకి ప్రవేశించాయి. అవి అలా ఇంకా ఇంకా ప్రవేశించాలనీ సాహిత్యానికీ, ప్రజలకీ మధ్య ఏర్పడిన తెంపు (disconnect) రద్దు కావాలనీ ఆశిస్తున్నాను. ఉదా:- తూర్పారబట్టడం – (భౌతికార్థం) వడ్లు జల్లించడం, (సాహిత్యార్థం) నిందించడం మొ|| మఱో ఉదాహరణ – తూర్పుగోదావరిజిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వాడే “కిట్టింపు” అనే పదాన్ని తీసుకుందాం. లెక్కలో వచ్చే హెచ్చుతగ్గుల్ని సరిపెట్టడానికి ఈ పదాన్ని వాడతారు. ఇది ప్రధానంగా బళ్ళలోను ట్యూషన్లలోను వినపడే పదం. ఎలాగైనా సరే answer వచ్చేలా చెయ్యడమన్నమాట. ఇది సానుకూలార్థం (positive meaning) లో వాడే పదం మాత్రం కాదు. ఇది కిట్టింపు ఎందుకయిందంటే- . కిట్టు = సరిపోవు కిట్టుబాటు = గిట్టుబాటు కిట్టించు = సరిపోయేలా చేయు ఈ రకమైన కిట్టింపు (manipulation of accounts) ని మనం సత్యం కంపెనీ కుంభకోణంలో గమనించాం. మన పాత్రికేయులెవఱైనా ఈ పదం వాడతారేమోనని చూశాను. ఎక్కడా కనిపించలేదు. దాన్ని బట్టి చూస్తే మనం (ఆలో చనాపరులం) ప్రజలకి నేర్పాల్సినదాని కన్నా వారినుంచి నేర్చుకోవాల్సిందే ఎక్కువ ఉందనిపిస్తోంది. సంస్కృతం మీద అతి-ఆధారపాటు (over-dependence) 19. మన పదాల చరిత్ర ఇప్పటిదాకా ఎలా ఉందో టూకీగా సమీక్షించుకుందాం. ఇంగ్లీషు పదాలకి ప్రతిగా మనం ఇలా అనేక సంస్కృత శబ్దాలతో, సమాసాలతో తెలుగుని నింపేయడం, అవి జనానికి నోరు తిరక్కపోవడం, పైగా అవి ఆదాన అనువాదాలు (loan translations) అనే దృష్టితో వాటిని ప్రజలు చిన్నచూపు చూడ్డం, చులకనగా మాట్లాడ్డం, వాళ్ళు ఆదరించడం లేదని మనం బాధపడడం తఱచయింది. దాని బదులు ముచ్చటైన, పలకడానికి సులభమైన, తక్కువ అక్షరాలు గలిగిన తెలుగు ప్రత్యామ్నాయాలు దొరికినప్పుడు వాటినే వాడడం మంచిది. సంస్కృతపదాల కంటే అవి త్వరగా ప్రచారం లోకి వస్తాయి. సంస్కృతపదాల్ని విచ్చలవిడిగా తెలుగులోకి దిగవేయడం (dumping) లో ఉన్న ఇబ్బందుల గుఱించి కాస్త తెలుసుకుందాం. ౧. చాలా సందర్భాల్లో ఇలా దిగవేయబడే పదాలు అర్థరీత్యా తెలుగుపదాల కంటే గొప్పవి కావు. ౨. కానీ వాటికివ్వబడే అనవసరమైన గౌరవం వల్ల అవి తెలుగు పదాల్నీ నీచపఱుస్తాయి (demeaning). అంటే అవి తెలుగులోకి వచ్చినాక వాటి తెలుగు సమార్థకాల్ని నీచార్థంలో వాడడం మొదలుపెడతారు పండితులు. వాళ్ళని చూసి పామరులు కూడా తెలుగుపదాల్ని నీచార్థానికే పరిమితం చేస్తారు. ఉదాహరణకి క్రిందిపదాల్ని గమనించండి. . మట్టి = మృత్తిక చచ్చిపోయారు = మరణించారు కంసాలి = విశ్వకర్మ కంపు = వాసన బడి = పాఠశాల ఊరు = పట్టణం చెట్టు = వృక్షం ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. కనుక ఇలా దిగవేయడం తెలుగు ప్రాధాన్యాన్ని తగ్గించడమే ఔతుంది తప్ప అభివృద్ధి చెయ్యడం అవ్వదు. ౩. దిగవేసిన ప్రతి సంస్కృత పదంతో పాటు అనేక సంస్కృతప్రత్యయాల్ని, ఉపసర్గల్నీ కూడా దిగవేయాల్సి వస్తుంది. ఆ ప్రత్యయాలూ, ఉపసర్గలూ మన తెలుగువాళ్ళకి తెలిసినవి కావు. వాటి అర్థమూ తెలియదు, వాటిని ఎక్కడ ఎలా అతకాలో కూడా వాళ్ళకి తెలియదు. సంస్కృత వ్యాకరణంలో శాస్త్రీయమైన శిక్షణ లేకపోడం చేత ఒక పదంలో కని పించే ప్రత్యయాన్ని లేదా ఉపసర్గని ధైర్యంగా ఇంకో పదానికి అన్వయించుకోలేరు. అన్వయించబోతే అన్నీ తప్పులే వస్తాయి. అందుచేత అలా ఎన్నింటిని దిగవేసినా ఇంకా ఇంకా భారీగా దిగవేయాల్సి వస్తూనే ఉంటుంది. ఆ దరిద్రానికి అంతులేదు. దీనిక్కారణం – అవి తెలుగు కాకపోవడం, అవి తెలుగు వ్యాకరణంలో ఇమడకపోవడం. తెలుగు వ్యావహారికశైలిలో అసలే ఇమడక పోవడం. దీనికి పరిష్కారం – సంస్కృతపదాల బదులు కొన్ని సంస్కృత ప్రత్య యాల్నీ, ఉపసర్గల్నీ తెలుగులోకి తెచ్చి వాటిని నేరుగా తెలుగు పదాలకే కలపడం. ఉదాహరణకి :- ఉప-అద్దె (sub-rent) , తెలివిమంతుడు, నిష్పూచీ మొ|| అప్పుడు తెలుగుభాషలో కూడా సంస్కృతంలో మాదిరే పదనిష్పాదన ప్రక్రియ సులువూ, వేగవంతమూ అవుతుంది. ౪. సమాసఘటన చేసేటప్పుడు సంస్కృతపదాల్ని సంస్కృతపదాలతోనే కలపాలనే చాదస్తం మనవాళ్ళలో చాలా చాలా ఎక్కువ. అలా అవసరం లేకపోయినా ఇబ్బడిముబ్బడిగా సంస్కృతపదాలు సమాసాల ద్వారా తెలుగులోకి వచ్చి తిష్ఠవేశాయి. తిష్ఠవెయ్యడమే కాదు, సమాసాల ద్వారా అలవాటైన సంస్కృతపదాలు కొన్ని సందర్భాలలో అసలైన తెలుగుపదాల్నే భాషలోంచి ఏకమొత్తంగా తుడిచిపెట్టాయి. ఉదా :- ఉత్తరం, దక్షిణం. మన ముందున్న కార్యావళి (agenda) 20. తెలుగులో కొత్త పదాల్ని కల్పించడమనే కార్యకలాపం నాలుగు దిశల్లో జఱగాల్సి ఉంది. (అ) ఇంగ్లీషు పదాలకి సమార్థకాల (equivalents) కల్పన/అన్వేషణ (ఇ) ఇంగ్లీషులో లేనటువంటివి/మన స్థానిక తెలుగుభాషుల (Native Telugu speakers) భావాల వెల్లడింపుకి ఉపయోగపడేవీ అయిన కొత్త పదాల నిష్పాదన (Coinage) (ఉ) అన్యదేశ్యాల స్థానికీకరణ (Nativization) (ఋ) కొత్త పరిభావనల (Concepts) గుర్తింపు మఱియు నామకరణం. ఔత్సాహిక పదనిష్పాదకులు ఈ పై నాలుగో కార్యకలాపం గుఱించి కొంచెం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. మనమిప్పటి దాకా చేస్తూ వస్తున్నది ప్రధానంగా, ఆంగ్ల ఆరోపాలకి తెలుగు సమార్థకాల్ని నిష్పాదించడం. ఈ మార్గంలో మన భాష ఇంగ్లీషువారి పరిభావనలకి ప్రతిబింబప్రాయం మాత్రమే కాగలదు. పదాలనేవి పరిభావనల వ్యక్తీకరణలు మాత్రమే. అసలు పరిభావనలంటూ ఉంటే పదాలు పుట్టడం కష్టం కాదు. కనుక ముందు సరికొత్త పరిభావనల్ని ఆవిష్కరించే ప్రయత్నం కూడా జఱగాలి. చూడగల కళ్ళుంటే మనచుట్టూ ఉపయుక్తమైన సరికొత్త పరిభావనలు ఉన్నాయి. వాటిని గుర్తుపట్టాలి. అది భాషాస్వకీయత (originality) కీ, సుసంపన్నతకీ దారితీయగలదు. ఉదాహరణకు - ౧. చదువు చెప్పేవాడు = ఉపాధ్యాయుడు చదువుకునేవాడు = విద్యార్థి చదువు చెప్పించేవాడు (తండ్రి/ బడి యజమాని) = ? ? ? ? ౨. భవనం కట్టించేవాడు = కాంట్రాక్టరు, బిల్డర్ భవనం కట్టేవాడు = మేస్త్రి కట్టించుకునేవాడు = ? ? ? ? ౩. వెలుగు X నీడ ప్రతిఫలితమైన వెలుగు (reflected light) ని ఏమనాలి ? అలాగే ప్రతిఫలితమైన వెలుగు వల్ల ఏర్పడే నీడని ఏమనాలి ? ౪. ఎంజిన్ పనిచేస్తున్నది = బండి/ యంత్రం కదులుతున్నది ఇది యాంత్రిక చలనం. ఇంకో దృగ్విషయం : ఎంజిన్ పనిచేస్తున్నది కానీ బండి/ యంత్రం కదలడం లేదు. దీన్నేమనాలి ? ౫. సోదరి కొడుకు మగవారికి మేనల్లుడు. మఱి తమ సోదరుని కొడుకు వారికి ఏమవుతాడు? (మేనకొడుకు అందామా?) అలాగే సోదరుని కొడుకు ఆడవారికి మేనల్లుడు. మఱి తమ సోదరి కొడుకు వారి ఏమవుతాడు? ౬. మన పూర్వీకులు మానవ శరీరంలోని అన్ని భాగాలకీ పేర్లు పెట్టలేదు. కొన్నిటిని వదిలేశారు. వాటికి ఏమని పేర్లు పెడదాం ? ఏది చెయ్యాలన్నా ముందు మన భాషాస్వరూపం గుఱించి మనకి కొంత అవగాహన ఉండాలి. అది ఏర్పడాలంటే శబ్దార్థ చంద్రిక వంటి కోశాలను అనునిత్యం పరిశీలిస్తూ ఏ పదమైనా మనకి పనికొచ్చే లక్షణాలు కలిగి ఉందా ? అని కాస్త మధన పడాలి. రెండోది- బాలవ్యాకరణాన్నీ, సిద్ధాంతకౌముదినీ కూడా శోధించాలి. ఎందుకంటే ఒక మహాకవి చెప్పినట్లు “గతం నాస్తి కాదు నేస్తం, అది అనుభవాల ఆస్తి.” పాతపుస్తకాల బూజుదులిపి దుర్భిణితో గాలిస్తున్నంత మాత్రాన ప్రతి చాదస్తాన్నీ నెత్తిన వేసుకుంటామనుకోరాదు. ‘కొత్త పదాలు’ అంటే – ఏ విధమైన కొత్త పదాలు? పదాల్లో రకాలున్నాయి. ఇంగ్లీషువారు వాటికి Parts of speech అని పేరు పెట్టారు. మన భాషకి సంబంధించినంత వఱకు మనం సిద్ధం చెయ్యాల్సినవి : 1. క్రియాధాతువులు (verb-roots) 2. నామవాచకాలు (nouns) 3. విశేషణాలు (Adjectives) మళ్ళా వీటిల్లో చాలా రకాలున్నాయి. తెలుగుభాష నామవాచకాల్ని క్రియలుగా ఎలా మారుస్తుంది? క్రియల్ని నామ వాచకాలుగా ఎలా మారుస్తుంది ? ఒక నామవాచకంలోంచి ఇంకో నామవాచకాన్ని ఎలా నిష్పాదిస్తుంది? వీటన్నింటి నుంచి విశేషణాల్ని ఎలా పుట్టిస్తుంది ? మళ్ళీ విశేషణాల్లోంచి నామవాచకాల్నీ, క్రియల్నీ ఎలా రప్పిస్తుంది? ఇవన్నీ కూలంకషంగా తెలుసుకుంటే సగం అయోమయంలోంచి బైటపడతాం. 21. తెలుగులో పదనిష్పాదన మఱింత ప్రజాస్వామికం కావాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే ఎప్పుడూ ఎవఱో ఒకఱి ద్దఱు లేదా ముగ్గుఱు, నలుగుఱు సమార్థకాల్ని సూచించడం, వారి వద్ద మాత్రమే సమాధానాలు ఉండడమూ, మిగతావారివద్ద ప్రశ్నలు మాత్రమే ఉండడమూ తరగతిగదిలాంటి ఈ పరిస్థితి శీఘ్రంగా మారడం మిక్కిలి వాంఛనీయం. ఇది నిజానికి ఒక అభ్యసనాప్రక్రియ. ఇది ఒక ఇబ్బందికరమైన ప్రక్రియ. ఎందుకంటే మనం స్వయంగా నేర్చుకునే కంటే ఇతరులకి నేర్పడానికి ఎక్కువ ప్రయత్నిస్తూంటాం. ఈ వైఖరి మన మనోఽభివృద్ధికి అడ్డుపడు తుంది. అదే సమయంలో భాషాభివృద్ధికి కూడా! ౧. మఱింతగా పాత-కొత్త తెలుగు-ఇంగ్లీషు పుస్తకాల్ని చదవడం అలవాటు చేసుకోవాలి. అంతకన్నా ముఖ్యంగా పూర్తిగా తెలుగులోనే ఆలోచించడం, మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో మాట్లాడడం పనికిరాదు. ౨. ప్రతి పదానికీ తెలుగు సమార్థకం ఏమై ఉంటుందో అని ఊహించే ప్రయత్నం చేయాలి. ౩. తెలుగు పుస్తకాల్లో దర్శనమిచ్చే పదఘటనా వైచిత్రికి క్షణికంగా ముఱిసిపోయి ఆ తరువాత వాటిని అక్కడికక్కడే మర్చిపో కుండా “అవి ఏ ఆధునిక పద-అవసరాల్ని తీర్చగలవో?” అని ఉత్ప్రేక్షించే ప్రయత్నం చేయాలి. ౪. మాండలిక పదాల్ని ఇతోఽధికంగా అధ్యయనం చేయాలి. అవి కూడా మాండలిక ప్రతిపత్తిని అధిగమించి మఱికొంత ఉన్నతశ్రేణిలో ఏ ఆధునిక పద-అవసరాల్ని తీర్చగలవో అని ఉత్ప్రేక్షించే ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు ప్రామాణిక వాడుకలు చేయజాలని పనిని మాండలిక పదాలు లెస్సగా నెఱవేఱుస్తాయి. ౫. పదనిర్మాణనిమిత్తం తెలుగు-సంస్కృత వ్యాకరణ గ్రంథాల్ని తఱచుగా తిరగేయాలి. వ్యాకరణ పరిజ్ఞానం లేకుండా అర్థవంతమైన, పదునైన పదాల నిష్పాదన సాధ్యం కాదు. ఒక మేస్త్రీ ఎంత గట్టి పనివాడైనప్పటికీ, ఇసుక, ఇటుక, సిమెంటు అనే ఉపచయాలు (inputs) లేకపోతే ఎలాగైతే ఏమీ చెయ్యలేడో అదే విధంగా పద-ధాతు-ప్రత్యయ పరిజ్ఞానం లోపిస్తే ఇతరత్రా ఎంత మేధావులైనా వారు చేయగలది కూడా శూన్యం. పదనిర్మాణాలకి ఒక తార్కికమైన, హేతుబద్ధమైన సుక్రమం (consi-stency) అవసరం. దాన్ని వ్యాకరణ పరిజ్ఞానమే సమకూర్చగలదు. మనం మాట్లాడే భాషలోని పదాలూ, వాక్యాలూ, వ్యాకర ణమూ ఎంత తార్కికంగా ఉంటే మన జాతి యొక్క మేధాశక్తి కూడా అంత హేతుబద్ధంగానూ, నాగరికంగానూ ఉంటుంది. ప్రజలూ, ప్రజాభాష- వీటికి ఆ పరిజ్ఞానం అవసరం లేదనీ, అజ్ఞానమే సుజ్ఞానమనీ, రాచపుండు రాచబాట అనీ వాదించే మహామేధావులకు దూరం నుంచే ఒక నమస్కారం పెట్టవలసినది. ఎందుకంటే వైజ్ఞానికంగా అభివృద్ధి చెందిన ఆంగ్లంలో కూడా ప్రామాణిక శాస్త్రపదజాలమంతటికీ వ్యాకరణం ఉన్నది. అందుచేత వ్యాకరణం లేకుండా ఆంగ్లం లేదు. తెలుగైనా అంతే! ౬. హిందీలాంటి ఇతర భాషల్లో ఇంగ్లీషుకి ప్రతిగా వాడుతున్న సంస్కృత సమార్థకాల్ని యథాతథంగా తెలుగులోకి దింపుదల చేయడంలో ఉన్న సాంస్కృతికమైన ఇబ్బందుల్ని సమీచీనంగా గుర్తెఱగాలి. వారూ, మనమూ వాడుతున్నది గీర్వాణమే అయినప్పటికీ వారి వాడుకా, మన వాడుకా అచ్చుమచ్చుగా ఒకటి కాదు గనుక ఆ పదాలు తెలుగువారికి సద్యఃస్ఫురణ కావని గుర్తించినప్పుడు వాటిని వర్జించి మనం స్వకీయంగా, సరికొత్తగా పదనిష్పాదన చేయడమే వాంఛనీయం.
Posted on: Mon, 14 Jul 2014 11:26:40 +0000

Trending Topics



ss="sttext" style="margin-left:0px; min-height:30px;"> A conspiracy theory? A harmless good natured monument? Do your
Mrs. Schmidlap hires a maid with beautiful blonde hair. The first

Recently Viewed Topics




© 2015