ఓ తండ్రి.... ఓ - TopicsExpress



          

ఓ తండ్రి.... ఓ కొడుకు. తండ్రి రిటైరైపోయాడు. కొడుకు జాబ్ చేస్తున్నాడు. ఆ ఇంట్లో ఉండేది వాళ్లిద్దరే. ఆడ దిక్కు లేదు. కొడుక్కి ఓ అమ్మాయి పరిచయమైంది. చూడగానే మనసు దోచేసుకుంది. ఆ విషయమే తండ్రికి చెప్పాడు కొడుకు. తండ్రి కూడా సంబరపడ్డాడు. ఆ అమ్మాయిని ఇంటికి రప్పించుకుని తండ్రి చాలాసేపు మాట్లాడాడు. కొడుక్కి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేశాడు. ఇప్పుడా ఇంట్లో ముగ్గురయ్యారు. ఎందుకో ఆ అమ్మాయికి మావగారి పద్ధతి నచ్చలేదు. ఒక చోట పెట్టిన వస్తువు.... ఇంకో చోటికి మారుస్తాడు. మొక్కలకు వద్దన్నా నీళ్లు పోస్తున్నాడు. అన్నీ చిన్న చిన్న విషయాలే. కానీ ప్రతీది భూతద్దంలో చూస్తోంది. సూటిపోటి మాటలతో, చేష్టలతో మావగారిని హర్ట్ చేస్తూనే ఉంది. భర్త ఇంటికి రాగానే కంప్లయింట్ల మీద కంప్లయింట్లు. ‘‘ఏంటి నాన్నా.... ఇదంతా?’’ అని అడిగితే, ఆయన తెగ ఇదైపోయి ‘‘ఏదో తప్పయిపోయింది లేరా... నేనలా చేసి ఉండకూడదులే’’ అంటాడు. రోజూ ఇదే తంతు. అటు తండ్రి.... ఇటు భార్యా. మధ్యలో నలిగిపోతున్నాడు. అసలే బయటి సమస్యలకి తోడు ఇంటి సమస్యలు. ఫైనల్‌గా ఓ నిర్ణయానికొచ్చాడు కొడుకు. ‘‘నాన్నా... నువ్వు వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోతావా?’’ అనడిగాడు. దానికి తండ్రి వెంటనే ‘‘నువ్వు చెప్పింది కరెక్టే. అక్కడకు వెళ్తే నేనూ మనశ్శాంతిగా ఉంటాను. మీ ఆవిడ కూడా మనశ్శాంతిగా ఉంటుంది’’ అని చెప్పాడు. కథ వృద్ధాశ్రమానికి చేరుకుంది. డబ్బు కట్టేసి కొడుకు వెళ్ళిపోయాడు. తండ్రి ఒంటరిగా మిగిలాడు. అక్కడే ఉన్న ఓ ముసలి అటెండర్ ఈయన్ని గుర్తుపట్టి ‘‘మీరు విశ్వనాథ్ గారు కదా?’’ అనడిగాడు. ఆయన ఆశ్చర్యపోయి ‘‘నేను మీకు తెలుసా?’’ అన్నాడు. ‘‘మీకు గుర్తుందో లేదో... చాలా ఏళ్ళ క్రితం అనాథాశ్రమం నుంచి ఓ పిల్లాడ్ని దత్తత తీసుకున్నారు కదా. అప్పుడక్కడ నేనూ ఉన్నాను. ఆ పిల్లాడు ఏమయ్యాడు సార్?’’ అని అడిగాడు అటెండర్. ‘‘ఇప్పుడు నన్నిక్కడ జాయిన్ చేసి వెళ్ళింది ఆ కుర్రాడే’’ అని చెప్పేసి, కళ్ళజోడు తుడుచుకుంటూ వృద్ధాశ్రమంలోని తన గది వైపు వెళ్ళిపోయాడాయన.
Posted on: Sat, 24 Jan 2015 06:00:01 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015